Sunday, 13 December 2020

హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ పై కౌన్సిలింగ్ మరియు పూర్తి సమాచారం

వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ 1 హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ పై కౌన్సిలింగ్ మరియు పూర్తి సమాచారం: Cr.జి.జేసు ప్రసాద్ బాబు , మెడికల్ కౌన్సిలర్ , ఐ‌సి‌టి‌సి , ప్రభుత్వ ఆసుపత్రి , నర్సాపురం. 1988 నుండి ప్రతి సంవత్సరం హెచ్.ఐ.వి. తో జీవిస్తున్న వారికి సంఘీభావంగా డిసెంబర్ 1 న ప్రపంచ ఎయిడ్స్ డే గా మనమందరం కలిపి జరుపుకుంటున్నాము. AIDS (Acquired Immuno Defficiency Syndrome - AIDS): జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనంతమైన ప్రచారం జరిగిన తర్వాత ఈ రోజు “ఎయిడ్స్" పేరు వినని వారు ఇంచుమించుగా లేరు. హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చే ఋగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం, హైపర్ టెన్షన్ (రక్తపోటు) లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక, నియంత్రించటానికి (Chronic and Manageable Disease ) వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు. ఇది హెచ్.ఐ.వి (హ్యూమన్ ఇమ్మ్యునోడెఫిసియెన్సీ వైరస్)అను వైరస్ వలన వస్తుంది. AIDS అనేది ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోం. శరీరంలో రోగనిరోధక శక్తి, బాహ్య కారణాల వల్ల తగ్గ్గడం అన్నమాట. హెచ్ఐవి వైరస్ మనుషలకు మాత్రమే సోకుతుంది. అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్" (Acquired Immuno Defficiency Syndrome) అనే వ్యాధి పేరులో ఉన్న మొదటి అక్షరాలతో (Abbreviation) ఏర్పడిందే "ఎయిడ్స్" (AIDS) అనే పదం Acquired - పుట్టుకతో వచ్చింది కాక, మధ్యలో సంపాదించుకున్న, Immuno - రోగ నిరోధక శక్తి Defficiency - లోపించటం Syndrome - ఈజబ్బు లక్షణాలు ఇవీ అని కచ్చితంగా, నిర్ధారణగా తేల్చి చెప్పలేని లక్షణాల సముదాయాన్న సిండ్రోమ్" అంటారు. ఈ జబ్బుకున్న స్వభావాన్ని బట్టి ఆ పేరు పెట్టారు. సహజసిద్ధమైన రోగ నిరోధకశక్తిని క్షీణింపచేయటం ద్వారా వచ్చే "సమయానుకూల వ్యాధుల" (Opportunistc Diseases) లక్షణాల సముదాయాన్నే "ఎయిడ్స్” అనవచ్చు 1981 లో మొట్టమొదటిసారిగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో బయటపడి ఈనాడు ప్రపంచ దేశాలంతటా పెద్ద ప్రశ్నార్థకమై కూర్చొంది. అంతర్జాతీయ వైరస్ నామినీకరణ కమిటీ" (International Committee of Nomenclature), "ప్రపంచ ఆరోగ్యం సంస్థ” (WHO) సహకారంతో వివిధ దేశాలు ప్రతిపాదించిన పేర్లను, వైరస్ లక్షణాలను, అది వ్యాధిక కారణమవుతున్న విధానాన్ని పరిశీలించి "హ్యామన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్" (Human Immuno Defficiency Virus) అని పేరు పెట్టింది. దీన్నే HIV' అని సంక్షిప్తంగా వ్యవహరిస్తున్నారు. HIV అంటే Human: మానవులలో, Immuno Defficiency : వ్యాధి నిరోదక శక్తిని క్షీణింపజేసే,Virus : క్రిమి అని అర్ధం. ఈ వ్యాధికి "ఎయిడ్స్" అని పేరు పెట్టినమూడు సంవత్సరాలకు గాని వ్యాధికి కారణం వైరస్ అన్న విషయం గుర్తించలేకపోయారు. పూర్వం మశూచి వలననో, కలరా వలననో, జనం లక్షల, కోట్ల సంఖ్యలో రాలిపోయినట్లే ఇప్పుడు ఎయిడ్స్ రోగంతో చనిపోతున్నారు. 1991 చివరకంతా ప్రపంచంలో 7 లక్షల మంది ఎయిడ్స్ రోగం సోకిన పిల్లలు పుట్టారు. 1992 చివరిదాకా వీళ్ళెవరూ జీవించలేదు. అయినా ఏ ఏటికాయేడు ఎయిడ్స్ పిల్లల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2000 సంవత్సరానికి ఈ పిల్లలు ఒక కోటిదాకా పోయి ఉంటారని ఓ అంచనా. ఇది ఇరవై యేళ్ళ నాటి మాట. ఎయిడ్స్ కనుగొన్న నాటి కంటే ఇప్పుడది 100 రెట్లు పెరిగింది. హెచ్.ఐ.వి. ఇన్ఫెక్షన్ గలవారు ప్రస్తుతం భారతదేశంలో కిన్ని కోట్లకి పైగా ఉన్నారు 1970 వ సంవత్సరంలో అప్రికాలో ఎయిడ్స్ వంటి కేసులు గుర్తించడం జరిగింది. 1981 వ సంవత్సరంలో USA లో మెట్ట మొదటి సరిగా ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులను గుర్తించారు. 1983 లో ఎయిడ్స్ రోగి నుండి ఎయిడ్స్ కరక క్రిమిని వేరు చేయడం జరిగింది. భారతదేశంలో మొదటి హెచ్‌ఐవి కేసు ఎప్పుడు గుర్తించారు,ఎవరు గుర్తించారు? 1986 వ సంవత్సరంలో భాతదేశంలో మద్రాసు (చెన్నై) నగరంలో మొట్టమొదటి ఎయిడ్స్ కేసుని గుర్తించారు. 1986 లో, భారతదేశంలో మొట్టమొదటిగా హెచ్ఐవి కేసును డాక్టర్ సునీతి సోలమన్ మరియు ఆమె విద్యార్థి డాక్టర్ సెల్లప్పన్ నిర్మల తమిళనాడులోని చెన్నైలో ఆరుగురు మహిళా సెక్స్ వర్కర్లలో గుర్తించారు. 1986 లో భారతదేశం యొక్క మొట్టమొదటి ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్) ను గుర్తించిన సూక్ష్మ జీవశాస్త్రజ్ఞుడు డాక్టర్ సునీతి సోలమన్. 1987 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ లో మొట్టమొదటి ఎయిడ్స్ కేసుని గుర్తించారు హెచ్‌ఐవి ఎయిడ్స్ వైరస్ ఎలా పుట్టింది? 1. ఈ వైరస్ ఎలా పుట్టిందనే దానికి మూడు వాదనలు వినపడుతున్నాయి ఈ వైరస్ పూర్వం నుండీ ఉండి ఉండవచ్చనీ, కాలక్రమేణా జన్యునిర్మాణంలో మార్పులు పొంది (Mutations) ప్రస్తుతం స్వభావాన్ని చూపే శక్తిని సంతరించుకొని ఉంటుందనీ, 2. ఈ వైరస్ కోతుల్లో ముఖ్యంగా ఆఫ్రికాలోని పచ్చజాతి కోతుల్లో ఉండి ఉంటుందని, ప్రయోగాల నిమిత్తం శాస్త్రవేత్తలు కోతుల్ని ఉపయోగించినప్పుడు ఆ వైరస్ మానవుల్లో విజృంభించి ఉంటుందని, 3. అమెరికాలోని వైద్యశాస్త్ర ప్రయోగాల్లో విభిన్న రకాలకు చెందిన వైరస్ జన్యు పదార్ధాలతో, పరిశోధనలు నిర్వహించినప్పుడు యాదృచ్చికంగా ఈ వైరస్ ఉద్భవించి ఉండవచ్చుననీ. ఇలా అనేక అభిప్రాయాలు ఉన్నాయి. 100℃ (100 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రత వద్ద ఒక సెకను కంటే ఉండదు, రక్తంలో కలిసినప్పుడు 60°C వద్ద నిర్ణీవం కావటానికి 10 గంటలు పడుతుంది. మనిషి శరీరంలో మాత్రమే ఇది జీవించగలుగుతుంది. మన శరీరంలో రోగ నిరోధకశక్తి ఒక అద్భుతమైన రక్షణ విధానం, పరాయి జీవి ఏదయినా మన మీద దాడిచేస్తే వెంటనే మన శరీరంలోని రోగ నిరోధక శక్తి ఎదుర్కొంటుంది. రక్షణ వ్యవస్థ (Protective Mechanism): మన శరీరంలో రోగ నిరోధకశక్తి ఒక అద్భతమైన రక్షణ విధానం. పరాయి జీవి ఏదయినా మన మీద దాడిచేస్తే వెంటనే మన శరీరంలోని రోగ నిరోధక శక్తి ఎదుర్కొంటుంది. రక్తంలోని తెల్లకణాలు, లింపు గ్రంథుల్లోని లింపు కణాలు. రక్షక పదార్ధాలు. వీటిని తయారు చేసే కణాలు అన్నీ ఒక క్రమపద్ధతిలో కలిసికట్టుగా పనిచేస్తాయి. సమాజాన్ని రక్షించటానికి ఉద్దేశించబడిన పోలీసు వ్యవస్థ ఎలా ఉందో అలాంటి వ్యవస్థ కన్నా మించిన గొప్ప రక్షణ వ్యవస్థ మన శరీరంలో ఉంది. పసిరికలు, పోలియో, జలుబు, మెదడువాపు వ్యాధి ఇలాంటి జబ్బులకి కారణమైన వైరస్లని చంపే మందులు లేవు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఈ వైరస్లని ఎదుర్కోగల రక్షక పదార్థాలను తయారు చేసుకుంటుంది. ఏమందులూ వాడనవసరం లేకుండానే వైరస్ లను ఈ రక్షక పదార్థాలు చంపేస్తాయి. ఇదంతా శరీరంలో రోగ నిరోధక శక్తి భద్రంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది కాని ఎయిడ్స్ వైరస్ రోగ నిరోధక శక్తి యొక్క ముఖ్య స్థావరం మీదే దాడి చేస్తుంది. కాబట్టి రోగాలకు వ్యతిరేకంగా శరీరం స్పందించే శక్తిని కోల్పోతుంది. ఎయిడ్స్ వైరస్ మనిషిని నేరుగా చంపదు. శరీరాన్ని రక్షించే రక్షణ ప్రక్రియను చంపేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి: వ్యాధి నిరోధక శక్తి ముఖ్యంగా రక్తంలోని తెల్లరక్తకణాల మీద ఆధారపడి ఉంటుంది. తెల్ల రక్తకణాలు అనేక రకాలు. వాటిలో ఎయిడ్స్ యొక్క దాడి టి.లింఫోసైట్ల మీద ఉంటుంది లింఫోసైట్లు (Lymphocytes): లింఫోసైట్లలో - “టి -లింఫోసైట్"లు, “బి-లింఫో సైట్"లు అని రెండు రకాలుంటాయి. టి-లింఫో సైట్లలో "సహాయ (helper) టి-4 కణాల"నీ, "సంహారక టి-8 కణాల" నీ రెండు రకాలు ఉంటాయి. సాధారణంగా మన శరీరంలో వ్యాధులు కలగజేసే వైరస్ క్రిములు గానీ, బాక్టీరియాలు గానీ, ప్రవేశించినప్పుడు టి-4 కణాలు వాటిని గుర్తించి ఇతర తెల్ల రక్తకణాలను ప్రేరేపిస్తాయి. అప్పుడు బి-లింఫోసైట్లు యాంటీబాడీలను తయారుచేసి వ్యాధి క్రిములను మింగేస్తాయి. అదే సమయంలో టి-8 కణాలు, మోనోసైట్లు, వ్యాధి క్రిములను మ్రింగి వేసి కణాలను నాశనం చేస్తాయి. ఆ విధంగా మన శరీరంలోకి ప్రవేశించే వ్యాధి క్రిములు ఎప్పటికప్పుడు నాశనం అవుతుంటాయి. దాన్నే మనం "సహజమైన వ్యాధి నిరోధక శక్తి" అంటాము అయితే ఎయిడ్ వ్యాధిని కలిగించే వైరస్ లు వ్యాధి నిరోధానికి మూలకారకాలైన టి-4 కణాలలోనికి ప్రవేశించి వాటిని నాశనం చేస్తాయి. అందువల్ల శరీరం వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతుంది. ఆపైన మన శరీరంలోకి ఏ రకమైన క్రిములు ప్రవేశించినా నిరోధక శక్తి లేకపోవటం వల్ల సులువుగా అన్ని రకాల వ్యాధులకూ గురై మరణిస్తారు. ఎయిడ్స్ గురించి ఇంతింత ఆందోళన చెందడానికి కారణాలు రెండున్నాయి. తిండిలేక రోగ నిరోధక శక్తి తగ్గిపోతే వచ్చే రోగాలు అందరికీ రావు, తిండిగల వారికి చాలావరకు రావు, తిండిలేని వారికయినా తిండి అందితే చాలా వరకు వెనుకటి స్టితి సాధించవచ్చు. టీకాలు వేయిస్తే కొన్ని రోగాలు రావు, వీటన్నింటిలో మొత్తం మీద రోగ నిరోధక వ్యవస్థ తిరిగి బలం పుంజుకోగల అవకాశం ఉంది. ఎయిడ్స్ రోగంలో అలా కాదు. మరో కారణం ఏమిటంటే : 1. అసలే మానవులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న మనదేశంలో జనం మీద "ఎయిడ్స్" వచ్చి పడటం అగ్నికి ఆజ్యం జతయినట్టే! రోగ నిరోధక వ్యవస్థ సజావుగా లేకపోతేనే ఏ రోగాలయినా వచ్చేది ! 2. చక్కెర వ్యాధి ఉన్న వారిలోనూ, సరైన పోషకాహారం అందని వారిలోనూ, కార్టికోస్టిరాయిడ్స్ అనే మందులు దీర్ఘకాలం వాడేవారిలోనూ, అవయవాల మార్పిడి సందర్భంలో వాడే “సైక్లోస్పోరిన్" లాంటి మందుల వలన కూడా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. 3. సరైన తిండిలేక, తద్వారా రోగ నిరోధక శక్తిలేక వచ్చే క్షయరోగం వలన మనదేశంలో ఏటా ఏడున్నర లక్షలమంది చనిపోతున్నారు. విరేచనాల వలన ఏటా 15 లక్షల మంది పసిపిల్లలూ చనిపోతున్నారు. 4. సరిగ్గా టీకాలు వేయించుకోనందువలన ఏటా మరో పది లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు 5. వీళ్ళంతా ఎయిడ్స్ రోగం వచ్చిన వారికంటే వేగంగానూ, ముందుగానూ చనిపోతున్నారు 6. నిజమే ! ఇలాంటి జనానికి “ఎయిడ్స్" తో చనిపోవటం అనేది న్యాయంగా భయోత్సాతం కలిగించే సమస్యే కాదు వీటన్నింటి గురించీ తగిన జాగ్రత్తలు తీసుకున్న పాశ్చాత్య దేశాలు ఇక భయపడాల్సింది క్యాన్సర్ గురించి, గుంటి జబ్బుల గురించి, ఎయిడ్స్ గురించే ! కాని మనం ఎయిడ్స్ కంటే ముందుగా తల బాదుకోవాల్సినవి ఇన్ని ఉన్నాయి 7. ఈ రోగాలకు ఎయిడ్స్ తోడయితే చావులు చాలావేగంగా వస్తాయి. హెచ్‌ఐ‌వి / ఎయిడ్స్ వైరస్ (AIDS Virus) : ఎయిడ్స్ వైరస్ రెండు భాగాలుగా ఉంటుంది. వైరస్ పై భాగంలో మాంసకృత్తుల(Proteins)తో ఒక పొర ఉంటుంది. ప్రొటీను పొరపై భాగంలో "గ్లెకో ప్రొటీన్ (G.P. 120)” అనే ప్రొటీను ఉంటుంది వెరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించిన తరువాత తెల్లరక్తకణాలలోని టి-4 కణాల మీద మొదట దాడి చేస్తుంది. టి-4 కణం పొరమీద సి.డి. 4 అనే అణువులు ఉంటాయి. వైరస్ పై పొరలో ఉండే జి.పి. 120, టి-4 కణం మీద ఉండే సి.డి.4తో మాత్రమే తొలుత అతుక్కుని ఉంటుంది. తరువాత క్రమంగా వైరస్ పైనున్న ప్రొటీను పొరకు రంధ్రం ఏర్పరుచుకుని లోపలనున్న జన్యుపదార్థం టి-4 కణంలోకి ప్రవేశించి ఆ కణ కేంద్రకంతో ఉన్నజన్యు పదార్థాలతో కలిసిపోతుంది. ఆ తరువాత వైరస్ పైనున్న ప్రోటీను గుల్లతో పని ఉండదు. టి-4 కణ కేంద్రంలోని జన్యుపదార్థాన్ని వైరస్ జన్యు పదార్ధం తనకు అనుకూలమైన జన్యు పదార్ధంగా మార్చి ఆ విధంగా టి-4 కణాలు నాశనమై వాటి స్థానంలో వైరస్ జన్యు పదార్ధాలు ఉత్పత్తి అయి ఇతర కణాల మీద దాడి చేస్తాయి. ఈ విధంగా మన శరీరంలో టి-4 కణాలు నాశనమవుతున్న కొద్దీ వాటి సంఖ్య తగ్గిపోతుంది. అందువల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతూ, రకరకాల వ్యాధులు శరీరంపై దాడిచేసి మనిషి మరణానికి దారితీస్తుంది. ఈ విధంగా ఎయిడ్స్ వైరస్ లు మానవ శరీరంలోకి ప్రవేశించి వ్యాధి నిరోధక శక్తిని పూర్తిగా హరించటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అది కూడా అనేక దశలుగా జరుగుతుంది. ఆయా దశలో ఎయిడ్స్ వైరస్ లకు గురైన రోగిలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. వీటిలో చివరి దశను మాత్రమే సాధారణంగా ఎయిడ్స్ వ్యాధి అంటారు. అంటే హెచ్.ఐ.వి. (HIV) వైరస్ సోకిన వారంతా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కాదన్నమాట. వ్యాప్తి (Mode of Spread) / కారణాలు (Causes) : ఎయిడ్స్ వైరస్ సోకిన వ్యక్తి రక్తంలో, వీర్యం (Sperm)లో, లాలాజలంలో, శోషరసంలో (Lymphatic Fluid), .కన్నీటిలో, మూత్రంలో, తల్లిపాలలో, యోని ద్రవం (Vaginal Secretions) లో, మెదడు, వెన్నుపాము పైన ఉండే ద్రవం (Cerebro Spinal Fluid) లో 'హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్నీ వెరస్' (HIV) వైరస్ ఉంటుంది. అయితే వీటిలో "రక్తం, వీర్యం" మాత్రమే ప్రధానంగా వ్యాధిని వ్యాపింపచేస్తున్నాయి. రక్తం, వీర్యం తోడ్పడినంతగా మిగితావి రోగవ్యాప్తికి దోహదపడవు. కాని అవి ప్రత్యక్షంగా రక్తంతో కలిసే వ్యాధి రావచ్చు. లాలాజలం వంటి ఇతర శరర స్రావాలలో కూడా వైరస్ లు తక్కువ సంఖ్యలోనయినా అసలంటూ ఉన్నాయి. బాహ్య ముద్దు ద్వారా వ్యాధి వ్యాపిస్తుందన్నదానికి దాఖలాలు లేవు. ఈ వ్యాధి ఇంత తక్కువ కాలంలో ఎక్కువ దేశాలకు వ్యాపించటానికి అంతర్జాతీయ ప్రయాణాలు అతి సులభతరం అవడం, దేశ విదేశాల మధ్య రాకపోకలు పెరగడం, టూరిజం. సెక్స్ సంబంధాలు అభివృద్ధి చెందిన దేశాల నుండి రక్తాన్ని, ముఖ్యంగా రక్త పదార్థాలని దిగుమతి చేసుకోవటం. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య హేపటైటిస్ గురించి ప్రచారం జరిగినట్లు, అంతకన్నా మందు ఎయిడ్స్ గురించి ప్రచారం జరిగింది దాంతో ప్రజలకి ఈ వ్యాధి పట్ల భయభ్రాంతులు, అపోహలు చెలరేగాయి. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి వ్యాపించటానికి నాలుగు ప్రధాన కారణాలున్నాయి: HIVAIDS సంక్రమణ లైంగిక సంబంధం ద్వారా సంక్రమణ - 91% రక్తమార్పిడి ద్వారా సంక్రమణ - 1% తల్లి నుండి బిడ్డకు- 3% ఇంజక్షన్ సూదులు, సిరంజీలు - 1% బార్బరు షాపులు, పచ్చబొట్లు, పొడిపించుకోవడాలు, లేబరేటరీల్లోను,ఆసుపత్రుల్లోనూ అనుకోని పరిస్థితుల్లో వ్యాధి సంక్రమణ - 4% ఒక్కసారికే HIV/AIDS సంక్రమణ పరిస్థితి (Efficasy of Transmission) HIVIAIDS ఉన్న వ్యక్తితో ఒకే ఒక్కసారి లైంగికంగా పాల్గొనడం వల్ల HIV సంక్రమించే అవకాశం కేవలం 0.1 నుండి 1% HIVIAIDS ఉన్న వ్యక్తి రక్తాన్ని పరీక్ష చేయకుండా ఎక్కించుకోవడం వల్ల ఆ వ్యాధి సంక్రమించే ప్రమాదం 90% HIVIAIDS ఉన్న రోగికి ఇంజక్షను ఇచ్చి అదే సూదితో సిరంజితో ఇంజక్షను ఇవ్వడం వల్ల వ్యాధి సంక్రమించే అవకాశం 5-10% ఇందులో ప్రధానంగా నరానికి ఇంజక్షను ఇవ్వడ ముఖ్య కారణం, కండకి ఇంజక్షను ద్వారా వ్యాధి సంక్రమణ చాలా తక్కువ 1.. హెచ్ఐవి వైరస్ కలిగి ఉన్న వ్యక్తితో సెక్స్ లో పాల్గొనటం స్వలింగ సంపర్కం ద్వారా ఈ వ్యాధి వ్యాపించటం ఎక్కువ. ఇద్దరు పురుషుల మధ్య లైంగిక సంబంధాలు కలిగి .ఉండే వారిని "హోమోసెక్సువల్స్” (Homo Sexuals) అంటారు. (Men Sex with Men (MSM) అని కూడా అంటారు. స్వలింగ సంపర్కం పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ. మనదేశంలో కొంచెం తక్కువ. పురీషనాళం మృదువుగా ఉండి బాక్టీరియా దాడికి సులభంగా లోనవుతుంది. దీనికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఎక్కువగా ఉంటాయి. సెక్స్ కలయికలో స్కలనం ద్వారా వ్యాధి క్రిములున్న వీర్యం ద్వారా వైరస్ రక్తంలోకి చేరుతుంది. వ్యభిచారం ఎయిడ్స్ వ్యాప్తికి ఒక ముఖ్యకారణం. భార్యాభర్తలిద్దరిలో ఎవరు వ్యభిచరించినా ఇద్దరికీ జబ్బు వస్తుంది. చివరకు పిల్లలకి వచ్చే అవకాశముంది. 2. ఎయిడ్స్ వైరస్ గల రక్తాన్ని లేదా రక్త పదార్థాలను (Blood Components) స్వీకరించటం: ఎయిడ్స్ వైరస్ ఉన్న వ్యక్తి శరీరం నుండి రక్తం ఒక్కటే కాదు. వీర్యం, మూత్రపిండాలు, నేత్రపటలం (Carnea) చర్మం, మూలుగ (Bone marrow) మొదలైనవేవయినా దానంగా అందుకున్నవారు "జబ్బును కూడా" అందుకుంటారు 3. ఎయిడ్స్ వైరస్ ఉన్న వారికి వాడిన సిరెంజ్లు, సూదులు, ఇతర ఆపరేషను సామాగ్రి సరిగ్గా ఉడికించకుండా (Sterilise) ఇతరులకి వాడటం: మాదక ద్రవ్యాలు వాడే వారు సిరంజిని సరిగ్గా ఉడికించకుండా ఒకరి తర్వాత ఒకరు ఇంజక్షన్ వేసుకుంటూ ఉంటారు వారిలో ఒక్కరికీ ఎయిడ్ రోగం ఉన్నా అందరికీ పంచిపెడతారన్నమాట ! గొప్ప సమానత్వం! "డబ్బుల పంపకంలో కాదు, జబ్బుల పంపకంలో!" ఈ "మాదకద్రవ్యాల" సమస్య ఇప్పుడిప్పుడే మనదేశంలో పుంజుకుంటూ ఉంది. మనదేశంలో జనం విచక్షణా రహితంగా ఇంజక్షన్లు వేయించుకుంటూంటారు. సూది మందుతో జబ్బు త్వరగా తగ్గుతుందనే సమ్మకం వీరికి ! కేవలం మాత్రలతో పోగల రోగాన్ని కూడా సూది మందు దాకా తీసుకెళ్తారు. ఈ సూదులు సరిగ్గా ఉడికించకుండా వేస్తే అక్కడ కూడా హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ సోకే అవకాశం ఉన్నది. 4. ఎయిడ్స్ వైరస్ సోకిన స్త్రీ గర్భం ధరిస్తే పుట్టే బిడ్డకు వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. పైన పేర్కొన్న ప్రధాన కారణాలు ఈ నాలుగే అయినా వీటికి అనుబంధమైన కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. 5. ఎయిడ్స్ రోగులు వాడిన టూత్బ్రష్లు, రేజర్లు మరొకరు వాడటం ద్వారా; బయట గడ్డాలు, గుండ్లు చేయించుకుంటే మంగలికత్తులు, బ్లేడ్ల ద్వారా, పుణ్యక్షేత్రాల్లో తలనీలాలు సమర్పించుకునే సందర్భాలలో వరసబెట్టి అందిరికి వాడే మంగలి కత్తుల వల్లా HIV వైరస్ రావచ్చు. 6. ఈ వైరస్ ఉన్నవాళ్ళకు ఆపరేషన్లు చేసేటప్పుడు డాక్టర్లచేతులకు గాయాలయితే వారికి కూడారావచ్చు. హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ ఎవరికి రాదు: 1. గాలి, నీరు, ఆహారం, వంటపాత్రలు, బట్టలు, ఈగలు, దోమలు, పేలు, నల్లులు మొదలైన వాటి ద్వారా రాదు. 2. రోగులతో మాట్లాడటం, తాకటం, కలిసి మెలసి సన్నిహితంగా తిరగడం వలన రోగం రాదు 3. తుమ్మటం, దగ్గటం ద్వారా వ్యాధి ఇతరులకి వ్యాపిస్తుందనే దానికి ఆధారాలు లేవు 4. టాయిలెట్ ద్వారా రాదు. కలిసి ఆటలాడితే రాదు 5. కండోమ్స్ లాంటివి వాడటం వంటి జాగ్రత్తలు తీసుకునే వారికి కూడా దాదాపుగా రాదు. ఎయిడ్స్ వ్యాధిని రెండు రకాలుగా చూడవచ్చు (Types of AIDS) 1. లక్షణ రహిత ఎయిరడ్స్” (Asymptomatic AIDS) 2. లక్షణ సహిత ఎయిడ్స్" (Symptomatic AIDS) ఎలాంటి లక్షణాలూ కనపడకపోతే “లక్షణ రహిత ఎయిడ్స్" (Asymptomatic AIDS) అని అంటారు. లక్షణాలు బయటపడకుండా, శరీరం లోపల వైరస్ ఉన్న వారంతా “క్యారియర్స్!” వీరివలన కూడా జబ్బు వ్యాపిస్తుంది. క్రింద చెప్పిన ఏ రకం లక్షణాలతోనైనా బయటపడే జబ్బుని "లక్షణ సహిత ఎయిడ్స్" (Symptomatic AIDS) అంటారు. ఎయిడ్స్ వైరస్ శరీరంలో ప్రవేశించిన దగ్గర నుంచి వ్యాధి లక్షణాలు బహిర్గతం చేయటానికి ఆయా వ్యక్తుల శరీరతత్వాన్ని బట్టి 5-10 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. ఇప్పటి వరకు వైద్యశాస్త్ర చరిత్రలో ఇంతసుదీర్ఘమైన 'ఇంక్యుబేషన్ పీరియడ్" (Incubation Period) గల వ్యాధి మరొకటి లేదు. వ్యాప్తికి ప్రధాన కారణాలు: ఈ వైరస్ శరీరంలో "ఇంత నెమ్మదిగా ఎందుకు వ్యాప్తి చెందుతుంది ?” అనేది ఆలోచించవలసిన విషయం. శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ మొదటి దశలో ఈ వైరస్ ని గుర్తించి దానిని నాశనం చేయటానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అందువలనే వైరస్ మొదట్లో ఎక్కువ ప్రభావాన్ని కలిగించదు. కాని వైరస్ నెమ్మదిగా టి -4 కణాలను నాశనం చేస్తూ పోతుంది. దానితో వైరస్ మీద వ్యాధి నిరోధక వ్యవస్థ ఒత్తిడి తగ్గిపోయి చివరికి పూర్తిగా దెబ్బ తింటుంది. లక్షణాలు / ఎయిడ్స్ దశలు (ClinicaLFeatures /Stages of AIDS): వాల్టర్ రీడ్" అనే శాస్త్రవేత్త వ్యాధి లక్షణాలను దశలవారీగా విభజించారు. అందువల్ల దీన్ని "వాల్టర్ రిడ్ విభజన”అంటారు. 0 దశ : వైరస్ మొదట మానవుని శరీరంలో ప్రవేశించినప్పుడు అప్పటి అరోగ్య దశను "0 దశ" అంటారు. అప్పుడు రక్తంలో వైరస్ కనుక్కొవటం చాలా కష్టం. బయటికి ఎలాంటి రోగ లక్షణాలు కనిపించవు. కానీ రక్తంలో మాత్రం వైరస్ లకు "యాంటీబాడీ" లు కనిపిస్తాయి. ఈ దశలో రోగి శరీరంలో వ్యాధి క్రిములను కనుక్కోవటానికి ఆరువారాల నుండి సంవత్సరం పాటు పరీక్షలు జరపాల్సి ఉంటుంది. మొదటదశ (Stage I) : "0" దశనుండి రోగి ఒకటవదశలోకి ప్రవేశిపాడు. ఈ దశలో రక్తంలో వైరస్ జన్యుపదార్థం గానీ, ప్రోటీనులు గానీ కనిపిస్తాయి. ఈ దశలో కూడా సాధారణంగా ఎలాంటి రోగ లక్షణాలు కనిపించవు. కొంతమందిలో జ్వరం రావటం, గ్రంథులు వాయడంతో బాటు కేంద్ర నాడీమండల లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో వ్యాధి సౌకిన రెండు నుంచి ఎనిమిది వారాలలోపు జ్వరం, అరుదుగా చర్మంపై తట్టు తేలటం, తలనొప్పి, నిస్త్రాణ, రాత్రులలో చెమట ఉంటాయి. ఈ లక్షణాలు కొద్దిరోజులలో మందులు వాడినా, వాదకపోయినా తగ్గిపోతాయి. ఈ దశనే "సిరో కన్వర్షన్ ఇల్ నెస్ " (Sero Conversion illness) “అక్యూట్ హెచ్‌ఐ‌వి ఇన్ఫెక్షన్ " (Acute HIV Infection) అంటారు. 2 నుండి 12 వారాలలో వైరస్ యాంటీ బాడీలు రక్తంలో కనబడతాయి. దీనినే "విండో పీరియడ్" (Window Penod) అని కూడా అంటారు. ఈ దశ దాటాకే మామూలుగా చేసే హెచ్.ఐ.వి. స్క్రీనింగ్ పరీక్షల్లో HIV సోకినట్లు తెలుస్తుంది. అయితే ఆ తరువాత వైరస్ క్రిములు కొంతకాలం అక్కడ స్తబ్దుగా ఉండిపోతాయి. అందువల్ల ఈ లక్షణాలు కొద్ది వారాల్లో తగ్గిపోతాయి. రెండవ దశ (Siage II) : స్క్రీనింగ్ టెస్టులో హెచ్. ఐ.వి. ఉన్నట్లు తెలుస్తుంది. లింపు గ్రంథుల వాపు మినహా మరే లక్షణమూ కన్పించదు. ఇలా లక్షణాలు కన్పడని "క్యారియర్" దశ ఎంతకాలమయినా ఉండవచ్చు. కొందరిలో లక్షణాలేమీ కన్పించని దశ ఇది. తర్వాత కొంత కాలానికి వైరస్ లు విజృంభిస్తాయి. కొందరిలో మెడ, చంకలు, తొడలలోని లింపు గ్రంధులు వాస్తాయి. స్పష్టమైన కారణం లేకుండా నూటికి పదివంతులు బరువు తగ్గవచ్చు. ఇది ప్రధాన లక్షణం. నీరసం, బలహీనత నెలకు మించి ఉంటాయి. నాలుగు వారాలకు మించి దగ్గు ఉంటుంది. పదే పదే శరీరంపై దురదతో కూడిన కురుపులు, ఆకలి తగ్గటం, కాళ్ళలో సత్తువ లేకపోవటం లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ దశలో వ్యాధిగ్రస్తుడు 5 నుండి 7 సంవత్సరాల వరకు ఉంటాడు. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కలిగించే "కీలక కణాలు" (CD-4 కణాలు) సాధారణంగా ప్రతి ఘనపు మిల్లీ మీటరు ప్రదేశంలో 800 వరకు ఉంటాయి. వైరస్ క్రిములు దాడి వల్ల ఇవి నాశనమయ్యి ఈ దశలో వాటి సంఖ్య ఘనపు మిల్లీ మీటరుకు 500-800 మధ్య ఉంటుంది. మూడవ దశ (Stage IIl) : ఈ దశలో నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. వారం రోజులకు మించి అకారణంగా జ్వరం రావటం, రాత్రిళ్ళు చెమటలు పట్టి మెలకువ రావటం, నీళ్ళ విరేచనాలు (Diarrhoea) వచ్చి తగ్గకపోవటం,పొడి దగ్గు మొదలైన లక్షణాలుంటాయి. ఈ దశలో ప్లీహం (Spleen) వాస్తుంది. దీన్ని "ఎయిడ్స్ రిలేటెడ్ కాంప్లెక్స్" (AIDS Related Complex/ ARC) అనేవారు. CD-4 కణాలు 200-500 మధ్య ఉంటాయి. నాలుగవ దశ (Stage IV) : ఈ దశలో శరీరంలో CD-4 కణాల సంఖ్య 50-200 మధ్య ఉంటుంది. ఇతర సంహారక తెల్ల రక్తకణాలు కూడా పనిచేయవు రోగ నిరోధక శక్తి బాగా పడిపోతుంది. నాలుక, నోటి కుహరాలలో మ్యూకస్ పొరమీద "త్రష్" (Thrush) అనే ఫంగస్ వ్యాధి వస్తుంది. దీన్నే "ఓరల్ క్యాండిడియాసిస్" (Oral candidiasis) అంటారు మామూలుగా తేలికగా నివారించబడే ఫంగస్ వ్యాధులు, వైరస్ వ్యాధులు ఈ దశలో రోగిలో అదుపు లేకుండా పెరుగుతాయి. రోగనిరోధక శక్తి ఇంకా తగ్గిపోయి, అనేక రకాల వ్యాధులు రోగి శరీరాన్ని పూర్తిగా ఆక్రమిస్తాయి. మెదడు కణాలు నాశనమవుతాయి. జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. నిద్రపట్టదు, వణుకుడు, ఫిట్స్, బుద్ధిమాంద్యం వంటి లక్షణాలతో పాటు సమయానుకూల వ్యాధులెన్నో వస్తాయి. ఐదవ దశ (Stage V): CD-4 కణాలు ఘనపు మిల్లీ లీటరుకు 50 కంటే తక్కువ ఉంటాయి. ఈ దశలో సమయానుకూల వ్యాధులు విపరీతంగా విజృంభిస్తాయి. రెండు సంవత్సరాలలోపు రోగి చనిపోవచ్చు. హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ 4వ దశ నుండి 5వ దశలో శరీరాన్ని ఆక్రమించగల సమయానుకూల వ్యాధులు : సైటోమెగలో వైరస్ వ్యాధి, బాక్టీరియల్ సెప్టిసీమియా, క్షయ, టాక్సో ప్లాస్మోసిస్, క్రిప్టోకోక్కస్, హిస్టోప్లాస్మోసిస్, కపోసి సార్కోమా, నాన్ హార్జికిన్స్ లింఫోమా హెర్పిస్ జోస్టర్, కాండిడా, నిమటోట్ వ్యాధులు, క్యాన్సర్, చర్మ వ్యాధులు, న్యూమోసిస్టిస్ కార్నై, ప్రేవుల్లో జబ్బులు, ఏస్పర్టిల్లోసిస్, సాల్మనేల్లోసిస్, ఏక్టినో మైకోసిస్, ఏబిస్టిన్ బార్ వైరస్ వ్యాధి, హెర్పిస్ సింపలెక్స్ వగైరాలు... ఇలా నోరు తిరగని పేర్లున్న జబ్బులు ఎన్నో ఉన్నాయి. "కపోసి సార్కోమా” - రక్తనాళాలకు సంబంధించిన కంతులు, నీలం రంగులో ఒంటిమీద, చంకల్లో కదుములు కట్టం, అవి గడ్డలవటం, పుళ్ళుగా మారటం ఒక ప్రత్యేక లక్షణం. వ్యాధి మెదడులో ఉంటే - మెదడు చుట్టూ ఉన్న నాడీ మండలంలో మంట, వాపుతో నాడీ మండలం శిధిలం అవటం, తలపోటు, మానసిక అస్థిరత, ఏకాగ్రతను కోల్పోవటం, ఆలోచనా శక్తి తగ్గటం, నిరాసక్తత, నిర్దిప్తత, జ్ఞాపకశక్తి, తగ్గటం, నిర్ణయాత్మక శక్తిని కోల్పోవడం, వ్యాధి త్వరగా ముదిరి మెదడు దెబ్బతినటం జరుగుతుంది. హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు (Tests): ప్రస్తుతం మనదేశంలో ఎయిడ్స్ వ్యాధిని గుర్తించటానికి అనేక పరీక్షలున్నప్పటికీ, ముఖ్యంగా రెండు రకాల రక్త పరీక్షలను ఉపయోగిస్తున్నారు ఎలీసా పరీక్ష (Elisa Test) E = Enzyme L = Linked I = Immuno S = Sorbent A = Assay "Enzyme Linked Immuno Sorbent Assay Test" యొక్క సంక్షిప్త రూపమే “ఎలీసా” (Elisa) పరీక్ష. ఇది తక్కువ ఖర్చుతో కూడిన ప్రాథమిక నిర్ధారణ పరీక్ష అయినందున దీనిని "స్క్రీనింగ్" పరీక్షగా పరిగణిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా రక్తంలో ఎయిడ్స్ వైరస్ వ్యతిరేకంగా శరీరంలో ఏర్పడిన రక్షక పదార్థాల (Anti Bodies) ఆధారంగా HIV శరీరంలో ఉందీ లేనిదీ తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష పాజిటివ్ అయినంత మాత్రాన ఆ వ్యక్తికి ఎయిడ్స్ ఉందని కచ్చితంగా చెప్పలేము. ఇందులో "ఫాల్స్పాజిటివ్” (False Positive) ఫలితాలొచ్చే అవకాశం ఉంది. దీనిని కేవలం ప్రాథమిక నిర్ధారణ పరీక్షగానే చూడాలి. "విండోపీరియడ్” (Window Period) లో ఈ పరీక్ష వలన రోగ నిర్ధారణ చేయలేము. హెచ్‌ఐ‌వి పరీక్ష ఎక్కడ చేస్తారు : రాపిడ్ బ్లడ్ టెస్ట్ : (Rapid Blood Test) ప్రభుత్వ ఆసుపత్రులలో (NACO-APSACS-ICTC) నేకో ఏ‌పిసాక్స్ ఐ‌సి‌టి‌సి పరీక్షా కేంద్రాలలో రాపిడ్ బ్లడ్ పరీక్ష ఎయిడ్స్ స్క్రీనింగుకు ఉపయోగించే రక్త పరీక్షలో ముఖ్యమైన పరీక్ష ఇది. దీనిలో పాజిటివ్ అని నిర్ధారణ అయితే మరో రెండు మూడు రాపిడ్ బ్లడ్ టెస్ట్ పరీక్షలతో నిర్ధారణ కొరకు పరీక్ష చేస్తారు. మొదటి టెస్ట్ లో పాజిటివ్ , రెండవ టెస్ట్ లో పాజిటివ్ , మూడవ టెస్ట్ లో పాజిటివ్ అని మూడు పరీక్షలలో నిర్ధారణ అయితేనే ఆ వ్యక్తికి హెచ్‌ఐ‌వి పాజిటివ్ అని నిర్ధారణ చేస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నీ ప్రభుత్వ ఆసుపత్రులలో ఐ‌సి‌టి‌సి పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలు ఉచితంగానే చేస్తారు. కనుక ఎయిడ్స్ వైరస్ సోకే అవకాశం గల వారు దగ్గరలోని ఐ‌సి‌టి‌సి పరీక్షా కేంద్రాలకు వెళ్ళి రక్త పరీక్ష చేయించుకోవటం మంచిది. సిడి4 కణాల సంఖ్య: మనుషుల రోగనిరోధకతకు రక్తంలో సిడి4 అనే రకం తెల్ల రక్తకణాలు ఎంతో దోహద పడతాయి. ఇవి రోగకారక జీవాలతో పోరాడి మనుషులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే హెచ్ఐవీ ఈ సిడి4 కణాలను చంపేస్తుంది. హెచ్ఐవి పెరుతున్నకొద్దీ ఈ సిడి4 కణాలు నశించటం ప్రారంభిస్తాయి. ఒక మైక్రోలీటరులో 200 కన్నా తక్కువ సిడి4 కణాలు ఉన్నట్లయితే అప్పుడు ఎయిడ్స్ ఉన్నట్లు ధ్రువపరుస్తారు. హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ వైద్యం – ప్రయత్నాలు: ఎయిడ్స్ కారక వైరస్ ఒకే రూపంలో ఉండదు. అది తన రూపాన్ని జన్యుమార్పుల ద్వారా త్వరగా మార్చుకుంటుంది ప్రస్తుతం ఈ వైరస్ వంద రకాలుగానైనా ఉండొచ్చునని అంచనా. అందువలన వీటిలో ఒక రకానికి టికా మందు తయారుచేసినా ఈ సమస్య పరిష్కారం కాదు. టీకా మందు మార్కెట్లోకి వచ్చేలోపే, వైరస్ జన్యునిర్మాణం మార్చుకుంటుంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ వ్యాధిని పూర్తిగా నిరోధించే మందులు, వ్యాక్సిన్లు కనుక్కోలేకపోయినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. నాల్గవ దశలో వచ్చే చాలా వ్యాధుల నివారణ కొంత కనిపెట్టగలిగారు. నాడీ మండల వ్యాధులకు నేడు కారణాలను వాటి నివారణను కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ కు అందుబాటులో ఉన్న వైద్యం (Available Treatment) 1984లో తర్వాత కనిపెట్టిన మందులు 300 పైగా ఉన్నాయి. అందులో 15 మందులు ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టాయి. వీటిలో చాలా మందులకు "సైడ్ ఎఫెక్ట్స్" (side effects) చాలా ఎక్కువ ఉండటంతో వాటి వాడకం నిలిపివేశారు HIV వైరస్ లో HIV-1, HIV-2 అనే రెండు రకాలున్నాయి. మొదటిరకం వైరస్ లో మళ్ళీ 9 రకాలున్నాయి HIV వైరస్ తో పోరాడే మందులను "యాంటీ రిట్రోవైరల్స్" (Anti-Ritro-Virals) గా వ్యవహరిస్తారు. కచ్చితంగా నిపుణుల పర్యవేక్షణలోనే వైద్యం జరగాలి. ప్రభుత్వ ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఏ‌ఆర్‌టి సెంటర్ లలో హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ సోకినవారికి ఉచితంగా జీవితకాలము ఏ‌ఆర్‌టి హెచ్‌ఐ‌వి మందులను ఇస్తారు. ఐ‌సి‌టి‌సి కేంద్రాలలో హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ అని నిర్ధారణ అయిన తరువాత ఏ‌ఆర్‌టి సెంటర్ లో మందులను ఉచితంగా ఇస్తారు. ఈ ఏ‌ఆర్‌టి మందులను మనిషి జీవించినంత కాలము వాడాలి. ఈ ఏ‌ఆర్‌టి మందులు వాడడం వలన సి‌డి4 కౌంట్ పెరుగుతుంది. సమయానుకూల వ్యాధులు వచ్చినపుడు తగిన యాంటీబయాటిక్స్ ఉపయోగించి అదుపు చేయాలి. సమయానుకూల వ్యాధులని అడ్డుకొని దేహాన్ని రక్షించే వ్యవస్థ మరొకటి లేదు. కృత్రిమంగా అనేక మందులు వాడుతూ రక్షించడానికి చేస్తున్న అనేక ప్రయోగాలు సహజసిద్ధమైన రోగ నిరోధక వ్యవస్థకు సాటి రావటం లేదు, వ్యాధి లక్షణాలుగా పేర్కొనబడుతున్న లక్షణాలన్నీ ఈ సమయానుకూల వ్యాధుల వల్ల వచ్చినవే. స్వచ్ఛందంగా రక్తదానం చేసే వాళ్ళని ప్రోత్సహించాలి. అవసరం కొద్దీ, ఆదుర్దా కొద్దీ రక్తం తీసుకుంటే కొత్తసమస్యల్ని కొని తెచ్చుకున్నట్టే ! వృత్తి రక్తదాతల నుంచి రక్తం తీసుకోరాదు. లైసెన్సు పొందిన బ్లడ్ బ్యాంకుల నుంచే రక్తం తెచ్చుకోవాలి. శిశువులలో హెచ్‌ఐ‌వి : సాధారణంగా హెఐవి సోకిన తల్లులకు పుట్టిన బిడ్డలకు హెచ్ఐవి సోకిందో లేదో తెలుసుకోడానికి కనీషము 18 నెలలు వ్యవధి కావాలి. హెచ్ఐవి తల్లుల సాదారణ పురుడులో 30% వరకూ,హెఐవి సోకిన తల్లి పాలు తాగిన పిల్లలకు 10%-15% వరకూ,సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టినపిల్లలకు 1% జబ్బు అంటుకునే అవకాశాలున్నాయి. హెచ్ఐవి తల్లులకు గర్భినిగా ఉన్నపుడు 'ఎ.అర్.టి.' మందులు వాడమువలన బిడ్డలకు 'హెచ్ ఐ వి' సోకే అవకాశము 1-2% వరకు తగ్గుతుంది. 18 నెలలు వ్యవధిలో బిడ్డకు హెచ్ ఐవి జబ్బు ముదిరిపోయే అవకాశము ఎక్కువే కావున మామూలు పరీక్షలతో నిర్ధారణ చేయడము కంటే వేగవంతమైన పరీక్ష ఉంటే బాగుండుననే ఉద్దేశముతో ఈ మధ్యన డిఎన్ఎ-పిసీర్ పరీక్ష ద్వారా 0-7 రోజుల వయసులో హెచ్‌ఐవి పరీక్షలు ఇర్వహించి తొందరగా హే ఐవి ట్రీట్మెంట్ ప్రారంభించి పూర్తిగా హెచ్ఐవి లేకుండా నివారించే అవకాశాముంది. ఈ పద్ధతి ద్వారా శిశువు కాలు వద్ద ప్రికింగ్ చేసి (రక్తసేకరణ) డిఎన్ఎ-పిసీర్ పరీక్షచేసి హెచైవి నిర్ధారణ చేస్తారు. చికిత్స నెవిరపిన్ ఓరల్ డ్రాప్స్ డాక్టర్ చెప్పిన మోతాదులో వాడాలి. హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ రాకుండా జాగ్రత్తలు (Precautions) 1. ఇతరులు ఉపయోగించిన సూదులు వాడరాదు 2. ఒక వంతు బ్లీచింగు పౌడరు, తొమ్మిది వంతుల నీటిని కలిపితే “బ్లీచింగ్ ద్రవం" తయారవుతుంది. ఇదిగాక సాధారణ క్రిమి సంహారులైన 70% ఇథనాల్, 35% ఇసోప్రొపైల్ ఆల్కహాల్, 5% ఫార్మాల్డీహైడ్, 3% హైడ్రోజన్ పెరాక్సెడ్, 0.5% లైసోల్, 0.2% గ్లూటరాల్డీహైడ్ ద్రావణం - ఇవన్నీ HIV వైరస్ ని క్రియా రహితం చేయగలవు. 3. సెక్సు భాగస్వాముల్లో ఎవరికి ఎయిడ్స్ ఉన్నాకండోమ్స్ కొంత వరకు మాత్రమే రక్షణగా ఉంటుంది. అందువల్ల వివాహానికి ముందు అక్రమ లైంగిక సంబందాలకి దూరంగా ఉండడం మంచిది. 4. వివాహమైన తరువాత భార్య భర్తల మధ్య మాత్రమే సక్రమ లైంగిక సంబందాలు కలిగిఉండడం మంచిది. 5. భార్య భర్తలు ఇద్దరు నమ్మకం కలిగి ఉండడం మంచిది. 6. ఒకసారి హెచ్‌ఐ‌వి సోకితే మనిషి జీవితకాలము హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ తో జీవించవలసి వస్తుంది 7. హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ వ్యాధికి తగ్గే మందు లేదు , నివారణ లేదా జాగ్రత్త ఒక్కటే మార్గము. నిరోధం (Prevention): రోగం రాకుండా చేసుకోటానికి "ప్రపంచ ఆరోగ్య సంస్థ" కొన్ని మార్గదర్శక సూత్రాలు చేప్పింది. ప్రజలకు ఎయిడ్స్ గురించిన వివరాలు ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ వాటిని తెలుసుకోవాలి. పరస్పర నమ్మకం ఉండే లైంగిక సంబంధాలను మాత్రమే ఎంచుకోవాలి, ఉంచుకోవాలి లైంగిక భాగస్వాములు పెరిగే కొద్దీ జబ్బు వచ్చే అవకాశం పెరుగుతుంది. భాగస్వాములు ఎంత తగ్గితే ఆ మేరకు జబ్బు వచ్చే అవకాశం తగ్గుతుంది. విశృంఖల లైంగిక అలవాట్లు ప్రమాదకరం! స్వలింగ సంపర్కం కూడా ఆ విధంగా హానికరమే. రక్తదానం పొందాల్సిన అవసరం ఎప్పుడో ఒకప్పుడు రావచ్చు. తాము తీసుకునే రక్తం కచ్చితంగా ఎయిడ్స్ క్రిమిలేనిదని తెలియటం అవసరం. రక్త పదార్థాలను దిగుమతి కూడా చేసుకుంటున్నాము. అవి ఎయిడ్స్ వైరస్ రహితమని స్పష్టంగా తెలియటం అవసరం. అత్యవసరం అయితేనే రక్తం మార్పిడి చేయించుకోవాలి. ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా రక్తదానం చేయటాన్ని ప్రోత్సహించాలి. స్టెరిలైజ్ చేసిన దూది, సిరెంజ్, పరికరాలు మాత్రమే ఉపయోగించాలి. విచక్షణారహితంగా సూదులను వేయించుకోవటం మంచిది కాదు ధూమ, మద్యపానాలు, మాదకద్రవ్యాలు, ఎయిడ్స్ వ్యాధి త్వరగా బహిర్గతం కావటానికి దోహదపడతాయి. ఈ దురలవాట్లన్నీ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. సుఖవ్యాధులున్న వారికి హెచ్.ఐ.వి. ఎయిడ్స్ వచ్చే అవకాశం 10 రెట్లు ఎక్కువ. హెచ్ఐవి రహిత సమాజం మన అందరి బాధ్యత హెచ్ఐవి రహిత సమాజం మన అందరి ధ్యేయం ఎయిడ్స్ పై చర్చించండి ఎయిడ్స్ వ్యాధిని నివారించండి ఎయిడ్స్ నివారణ మన అందరి భాద్యత వివాహానికి ముందు హెచ్ఐవి పరీక్ష మీ జీవితానికి రక్ష. గర్భవతి సమయంలో హెచ్ఐవి పరీక్ష మీ బిడ్డ జీవితానికి రక్ష గర్భవతి సమయంలో భార్య భర్తలు హెచ్ఐవి పరీక్ష చేయించు కోండి. హెచ్ఐవి పరీక్ష మీ జీవితానికి రక్ష ప్రతి గర్భిణి స్త్రీకి హెచ్ఐవి , సిఫలిస్ పరీక్ష తప్పనిసరి ప్రభుత్వ ఎ ఆర్ టి సెంటర్ లో ఎయిడ్స్ మందులు జీవితకాలం ఉచితం ప్రభుత్వ ఐ.సి.టి.సి సెంటర్ లో హెచ్.ఐ.వి పరీక్ష ఉచితం. జీవితం చాలా విలువైనది. నీ మనస్సు నీ జీవితాన్ని మార్చుతుంది (పాజిటివ్ థింకింగ్ – నెగెటివ్ థింకింగ్ ) . హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ పై కౌన్సిలింగ్ మరియు పూర్తి సమాచారం. Cr.జి.జేసు ప్రసాద్ బాబు , మెడికల్ కౌన్సిలర్ , ఐ‌సి‌టి‌సి , ప్రభుత్వ ఆసుపత్రి , నర్సాపురం.

No comments:

Post a Comment